Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page

సర్వేజనాఃసుఖినోభవన్తు

మన సమస్యలను పరిష్కరించుకొని శాశ్వతమైన సమాధానం పొందాలంటే దైవభక్తి ఎంతైనా అవసరం. ఈ దైవభక్తి సిద్ధించాలంటే మనలో ప్రతిఒక్కరూ ప్రతి నిత్యమూ, మనకున్న కాలంలో కనీసము 108 మార్లైనా భగవన్నామం స్మరించే అలవాటు చేసుకోవాలి.

మనం అనుదినం చేసే ప్రార్థన 'సర్వేజనాః సుఖినోభవన్తు' అని ముగిస్తాం. అంటే అందరూ సుఖంగా ఉండాలని తాత్పర్యం. అందరూ అంటే ఏ ఒక్కమతస్థులూ, ఏ ఒక్కదేశానికీ చెందిన ప్రజ మాత్రమే కాదనీ, విశ్వంలో ఉండే సమస్త మానవానీకమనీ అర్థం. ఇందులో బీద, బిక్కి,రాజూ, ధనికుడూ అన్న వివక్షతలేదు. సర్వులూ క్షేమంగా ఉండాలని మనం ప్రార్థించాలి.

క్షేమంగా ఉండటమంటే సర్వప్రజలకూ కడుపునిండా తిండిలభించాలి. ఆ తిండిఇచ్చిన వానిని, స్వీకరించినవాడు, సుఖంగా ఉండాలని కోరుకోవాలి.

మనదేశానికి దాదాపు రెండువేల సంవత్సరములక్రితం గ్రీసుదేశంనుంచి అలెగ్జాండరు వచ్చాడు. అతనితో బాటు వచ్చిన చరిత్రకారులు ఆనాటి మనదేశస్థితిని వర్ణించారు. మనదేశంలో వీధులలో బంగారాన్ని పారవేసినా, ప్రజలు అపహరించేవారు కాదని, ఆ చరిత్రకారులన్నారు. ఇతరదేశాలలో కూడా ఆ పరిస్థితులు ఉండి వుండవచ్చును. కానీ ప్రత్యేకంగా మన దేశమును గూర్చి ఆ చరిత్రకారులు ఇలా వ్రాయటంచేత ఇతర దేశములలో భారతదేశములలోని నైతిక ప్రమాణాలు లేవేమో అని అనుమానించవలసి వస్తుంది.

కాని నేటి దేశపు తీరు వేరు. పూర్వస్థితికి నేటిస్థితి అత్యంతం భిన్నంగా కనిపిస్తుంది. లంచగొండితనం, పదార్థాలలో కల్తీ, వ్యాపారంలో అన్యాయం, మొదలైన వాటిలో మనదేశం నేడు అగ్రగణ్యత వహించినదని చెప్పవలసినదే. నాగరికత, విద్య సౌభాగ్యంవల్ల ఈ అవగుణాలు సమసిపోతాయా? అమెరికావంటి దేశాలలో కూడ ప్రజలు ఈ అవగుణాలు కల్గివున్నారు. కనుక నాగరికతవల్ల గుణంలో మార్పు కలుగుతుందని చెప్పలేము. తీరా చూస్తే అటవిక ప్రజలు, ఆదిమనివాసులలో కనిపించే నిజాయితీ-నాగరికులలో కనిపించదు.

విద్యవల్ల బుద్ధివికాసం కలుగవచ్చు. కాని అది మనశ్శాంతికి దోహదమా! ఔషధంవల్ల తాత్కాలిక దేహోపశమనం కలుగుతుంది. కాని మనశ్శాంతి నిస్తుందా? ఈనాడు మన సుఖాలకోసం ఏర్పడ్డ వస్తువులు ఇన్ని అని చెప్పలేము. కానీ ఇవి నిజమైన సౌఖ్యాన్ని ఇస్తున్నవా?

ఈ ప్రాపంచిక ఈతిబాధల నివృత్తికి, ఆత్మసంతృప్తి, మనశ్శాంతి ఒక దివ్యౌషధం. ఆ మనశ్శాంతి హృదయపూర్వకమైన భగవద్భక్తి వలననే సాధ్యం ఆ భక్తిని సాధించడానికి ఈశ్వరప్రేమ అవసరం. మనశ్శాంతినిచ్చే ఆ భక్తిని ప్రసాదించేవాడు కూడా భగవంతుడే. భగవంతుని భక్తి ప్రసాదించవలసినదని మనము అనుదినమూ వేడుకోవాలి. ''భగవతి భవభంగకరీ భక్తి భద్రార్థదే ప్రసీద మమ'' - అని వేడుకోవాలి. దానికొరకు ఒక ఆలయాన్ని నిర్మించి, అందులో పరమేశ్వరిని ప్రతిష్ఠించి, ''నీవు ఇక్కడ ఉండు. నీకు వలసిన ఆహారం. వస్త్రం నేనిస్తాను. నా శ్రేయస్సున చూడటం నీబాధ్యత'' అని ప్రార్థించాలి. ఇవన్నీ సక్రమంగా మనం నివేదించినపుడు ఆ భగవంతుడు మన మొరను ఆలకించకపోతే ఆయన భగవంతుడే కాడు. కానీ మన నివేదనలో మాత్రం లోపం, దోషం లేనట్లు జాగ్రత్త పడాలి.

మనస్సును నిశ్చలంగా నిలిపినప్పుడే అజ్ఞాన నివృత్తి ఔతుంది. ప్రతి ఒక్కరి హృదయంలోను భగవంతుడున్నాడు. అజ్ఞానం నివృత్తి ఐనదే తడవు. భతవత్సాక్షాత్కారం కలుగుతుంది. మీరందరూ నా వద్దకు అనేక బహుమతులు తెస్తున్నారు. ఫలపుష్పాదులను తెస్తున్నారు. ద్రవ్యాన్ని ఇస్తున్నారు. నాకు ఇవేవీ వద్దు. దినానికి రెండునిమిషాలు మాత్రం ఇవ్వండి. ఆ రెండు నిముషాలు నిశ్చలమైన భక్తితో పరమేశ్వరునికి ద్వానించండి. అదే నాకు మహాప్రీతికరమైన కానుక. దినమంతా లౌకిక వ్యాపారంలో గడుపుతారుకదా? ఒక బీదసన్యాసికి రెండు నిముషములదానం ఇవ్వలేరా? నాకు కావలసినదంతే.

మాపై శ్లోకాలు వ్రాసే కవులంతా మమ్ములను జగద్గురువులు పొగడ్తారు. జగద్గురు అనే పదం దశావతారాలలో ఒక్క కృష్ణునికే వాడారు. 'కృష్ణం వందే జగద్గురుం' - ఆయన తర్వాత ఆదిశంకరులకు వాడారు. వారు స్థాపించిన పీఠంలో ఉన్నాం కనుక మమ్ములనూ జగద్గురువులని సంభోదిస్తున్నారు. ఒక శాస్త్రిగారికి కుమారుడున్నాడు. ఆ అబ్బాయికి సంధ్యావందనం కూడా రాదు. కానీ వానికి కూడా శాస్త్రి అనియే పేరు. వాడు కడపట సైన్యంలో చేరినా, వాని పేరు శాస్త్రియే! వానికా పేరు తరతరాలనుంచి వచ్చింది. తానుగా తెచ్చుకోలేదు. అలాగే మమ్ములను జగద్గురువులని చెప్పటం ఇవన్నీ అర్థవాదములే ఔతుంది.

మరి ఆదిశంకరులు మాత్రం జగద్గురువులు ఏలా అయ్యారు? మనదేశంలో ఎన్నో మతాలున్నాయి. ప్రతి మతానికి మఠాలున్నాయి. ఆ మతాచార్యులకు జగద్గురువులన్న బిరుదంలేదు. ద్వైతమతాచార్యులున్నారు. విశిష్టాద్వైతాచార్యులున్నారు. వారి కెవ్వరికీ ఈ బిరుదులేదు. వీరిలో ఒకరు మరొకరి మతాన్ని ఖండిస్తారు. మరి శంకరులు ఏమిచేశారు? వారు దేనిని ఖండించారు?

నిజానికి శంకరులు ఏ మతాన్నీ ఖండించలేదు. తమ కాలమున ఉన్న ప్రతి సిద్ధాంతాన్నీ వారు సానుభూతితోనే చూచారు. బౌద్ధమున్నది. అది లోకమంతా నశ్వరమని చెపుతుంది. ఆమాట వైరాగ్య ప్రతిపాదకమేకదా! అదే విధంగా సౌఖ్యము ప్రపంచాన్ని తత్త్వముగా వింగడించి అన్నీ నిష్ప్రయోజనమని చెబుతుంది. యోగశాస్త్రం మనోనిగ్రహానికి దోహదంగా వున్నది. అన్ని శాస్త్రాలూ ఏదో ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించి ఏర్పడినవని, అందుచేత శంకరులు దేనినీ ఖండించలేదు. వారి జగద్గురుత్వంలో ఉన్న కీలకం అదే.

శంకరులు ఎన్నో గ్రంథాలు వ్రాశారు. ఫలాని గ్రంథము శంకరులేనా వ్రాసినది? అన్న సంశయమూ, చర్చా నేటికి ఉన్నది. కానీ అందరూ 'భజగోవిందస్తోత్రం' శంకరులు వ్రాసినదే అంగీకరిస్తారు. భజగోవిందస్తోత్రం మననం చేస్తే మన చింతలన్నీ తీరిపోతాయి. 'కాతే కాంతా కస్తే పుత్రః' అన్న శ్లోకం అందరికీ తెలిసినదే. ఆ శ్లోకంలో 'భ్రాతః' అని పద ప్రయోగం చేస్తూ ఆప్యాయతతో తమ్ముడూ! నీభార్య ఎవరు? నీబిడ్డలెవరూ? నీవెక్కడ నుంచి వచ్చావు? ఎక్కడకు పోతావు? - అని సులలితంగా శంకరులు తత్త్వబోధ చేస్తున్నారు.

మనం ఈ విషయాలను గూర్చి ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? లౌకికవ్యాపారంలోనే జీవితమంతా గడచిపోతున్నది. ఈ ఐహిక ప్రపంచం శాశ్వతం కాదని అందరికీ తెలుసు. ఏనాడో ఒకనాడు అందరం చావవలసిన వారమే. ఈ జనన మరణ చక్రంనుంచి తప్పించుకోవటం యేలా? ఎన్నో గొప్ప పనులు మనం చేస్తున్నాం. మైళ్ళకొలది ఈదగల మనుష్యులున్నారు. చంద్రలోకానికి పోయిన వాళ్ళున్నారు. కానీ మనస్సును నిలపగల మనుష్యులు కనుపించడం అదుదుగావుంది.

అందుచేత మనం జీవిత ప్రయోజన మేమో ఆలోచించాలి. మనం ఆనందంగా ఉండగల స్థితిని అలవరచుకోవాలి. ఆ స్థితి మనశ్శాంతి ఉంటేకానీ రాదు. ఆ మనశ్శాంతి హృదయపూర్వకమైన భక్తిచేతకాని సిద్ధించదు. భక్తికోసం పరమేశ్వరిని ప్రార్ధించాలి. అప్పుడే మనం మనసౌఖ్యమేకాక సర్వుల సౌఖ్యమూ సాధించగలము. మన లక్ష్యము 'సర్వేజనాః సుఖినో భవన్తు' ఐతే ఆ లక్ష్యం భగవద్భక్తి వల్లనే సాధ్యమౌతుంది.


Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page